ఉత్తర గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయేల్ సేనలు.. 45 మంది మృతి

ఠాగూర్

ఆదివారం, 27 అక్టోబరు 2024 (13:41 IST)
ఇజ్రాయేల్ సైన్యం మరోమారు తీవ్రస్థాయిలో స్పందించింది. ఉత్తర గాజాపై బాంబుల వర్షంతో దాడి చేశాయి. ఈ దాడుల్లో ఏకంగా 45 మంది మృత్యువాతపడ్డారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయేల్ - హమాస్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. దీంతో పశ్చిమాసియా అట్టుడుకిపోతోంది.
 
తాజాగా ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాలో ఆరు భవానాలపై ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 35 మంది మృతి చెందారు. అదేవిధంగా ఓ ఇంటిపై జరిగిన మరో దాడిలో 10 మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, తాజా దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (సీఏఐఆర్‌) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది. ఈ దాడులను ఐడీఎఫ్‌ సైతం ధృవీకరించింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా ఈ దాడులు చెసినట్లు తెలిపింది.  
 
ఇదిలావుంటే, ఈ దాడులను జోర్డాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. 'ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలకు కఠోరమైన సవాలు. అమాయక పౌరుల లక్ష్యంగా దాడులు చేయడం దారుణం' అని ఎక్స్‌ వేదికగా పేర్కొంది. మరోవైపు బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాల్లోని రెండు భవానాలను ఖాళీ చేయాలని లెబనాన్‌ నివాసితులకు ఇజ్రాయేల్‌ దళాలు సూచించాయి. ఆ ప్రాంతం లక్ష్యంగా వైమానిక దాడులు చేయనున్నట్లు తెలిపాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు