చదువు రాకపోవడంతో చాలా బాధపడ్డాను.. డిప్రేషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (10:31 IST)
తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు తేడా గుర్తించినట్లు జనసేన నేత అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. నేటి రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయని పవన్ చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2017 కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటని విమర్శించారు. 
 
తాను చదువులో రాణించలేకపోవడంతో చాలా బాధపడ్డానని, ఒక దశలో అయితే డిప్రేషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పవన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమాజాన్ని పరిశీలించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం తనకు స్వభావరీత్యా అలవాటని చెప్పారు. ఈ ఆలోచనలు తీవ్రంగా ఉండడంతో తాను నక్సలైట్లతో కలిపోతానని కుటుంబ సభ్యులు భయపడ్డారని పవన్ తెలిపారు. 
 
తనకు నటనలో మొదటిలో ఆసక్తి లేదని, తానొక యోగిని కావాలని అనుకునేవాడినని పవన్ అన్నారు. అయితే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలని తన అన్నయ్య ఇడియట్ అని తిట్టి చెప్పడంతో తాను మనసు మార్చుకున్నానని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి