సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉంటే.. షరీఫ్ లండన్‌లో షాపింగ్ చేస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:32 IST)
భారత్, పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటే.. తమ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం లండన్‌లోని గుక్సీలో షాపింగ్ చేస్తూ గడిపారని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తూ ఉంటే నవాజ్ షరీఫ్ మాత్రం మోడీతో స్నేహం చేస్తున్నారని మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా ఉండివుంటే నరేంద్ర మోడీ ఈ విధంగా ప్రవర్తించి ఉండేవారు కాదన్నారు. 
 
ఆయన(నవాజ్‌)కు హురియత్‌ నేతలతో మాట్లాడటానికి తీరిక లేదు కానీ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారన్నారు. నవాజ్ నాయకత్వ లక్షణాలను చూపించి ఉంటే పాకిస్థాన్‌ ఈ పరిస్థితుల్లో ఉండేది కాదన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో నవాజ్ షరీఫ్ లండన్‌లోని గుక్సీలో షాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి