ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహా లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై అంతర్జాతీయంగా భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష పోటీలో భారత్ కీలక దేశంగా ఆవిర్భవించిందంటూ విదేశీ మీడియా కీర్తించింది. ‘తక్కువ ఖర్చుతో ప్రయోగాలను విజయవంతంగా చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం’ అని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. అంతరిక్ష ఆధారిత నిఘా, సమాచార వ్యవస్థల్లో వాణిజ్య మార్కెట్ పెరుగుతున్న తరుణంలో భారత్ ‘కీలక దేశం’గా తనను తాను నిరూపించుకుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఇప్పటి వరకు 39 సార్లు ఇస్రో ప్రయోగాలు చేయగా.. మొదటిది (విఫలమైంది) మినహా 38 సార్లూ భారత అంతరిక్ష సంస్థ వేసిన ప్రతి అడుగూ విజయమే. చంద్రయాన్ ఘనవిజయం తర్వాత ఇస్రో అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలకు ఓ బ్రాండ్‌గా మారింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 39వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 16వ ప్రయోగం కావడం విశేషం.
ఇస్రో 55 సంవత్సరాల సుదీర్ఘ అంతరిక్షయానంలో ఇదొక సువర్ణ మజిలీ. 2013లో ఆమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29ఉపగ్రహాలను , 2014లో రష్యా అంతరిక్ష సంస్థ 39 ఉపగ్రహాలను ఒకేసారి పంపించి రికార్డులు సృష్టిస్తే ఇపుడు ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపించి అంతరిక్షంలో సెంచరీని అధిగమించి వినువీధిలో భారత కీర్తిని ఇనుమడింపజేసింది.
2015 జూన్‌లో ఇస్రో 20 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపించిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం నాటి ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి వ్రవేశించిన వెంటనే కర్ణాటకలోని హాసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్, మారిషస్‌లోని గ్రౌండ్‌స్టేషన్ సిగ్నల్స్‌కు అందాయి. ఆ తర్వాతే ఉపగ్రహాలన్నీ సరిగానే ఉన్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో అమెరికాకు చెందిన 96 డవ్ అండ్ లెమూర్ శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ అందడానికి మరో మూడు నిమిషాలు అదనంగా తీసుకుని ఉపగ్రహాలు అంతరిక్షంలో బాగానే వున్నాయని అమెరికా గ్రౌండ్ స్టేషన్ తెలియజేసింది.
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భవిష్యత్తులో సరికొత్తగా భారీ ప్రయోగాలు చేయాల్సి వుంటుందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. పీఎస్‌ఎల్–సీ37 ఘనవిజయం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. బుధవారం ప్రయోగం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కిరణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
సార్క్‌దేశాలకు అనుకూలంగా సార్క్‌శాట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక ఉందని చెప్పారు. ఏ దేశమైనా ముందుకొస్తే వాణిజ్య పరంగా వారి ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈఏడాది జీఎస్‌ఎ ల్‌వీ మార్క్–3 ద్వారా జీశాట్–19, జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్09 ద్వారా జీశాట్– 9ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చంద్రయాన్–2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.