ఆప్ఘనిస్థాన్ దేశం తాలిబన్ తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ దేశ ప్రజలే భయంతో వణికిపోతున్నారు. పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అలాగే, వివిధ దేశాలు తమ ఎంబసీ సిబ్బందితోపాటు పౌరులను హుటాహుటిన స్వదేశాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాబూల్‌లో ఉన్న భారతీయుల తరలింపుపై ఇపుడు ఉత్కంఠత నెలకొంది.
ఆప్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడంలో ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 5వ తేదీకి ఆప్ఘనిస్థానులో అధికారులు సహా సుమారుగా 1,500 మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది బ్యాంకులు, ఐటీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఆసుపత్రులు, ఎన్జీవో సంస్థలు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ కంపెనీలు, యూనివర్శిటీలు, భారత ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి అనుబంధ మిషన్‌లలో పనిచేస్తున్నారు.
ఇంకోవైపు, జూలైలోనే కాందహార్‌లో భారత కాన్సులేట్ కార్యాలయ సిబ్బందిని భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మాత్రం యధావిధిగా పనిచేస్తూ వీసా జారీ తదితర సేవలు అందిస్తూ వచ్చింది. అయితే సోమవారం మధ్యాహ్నానికి కాబూల్‌లోని భారత ఎంబసీలో అధికారులు, సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ తదితర పారా మిలిటరీ సిబ్బంది సహా 200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ వాయుసేనకు చెందిన భారీ విమానం (సి-17 గ్లోబ్ మాస్టర్) ఒకటి అందుబాటులో ఉందని, దానిలో వీరందరినీ తరలించాలని యత్నిస్తున్నప్పటికీ ఎంబసీ నుంచి విమానాశ్రయానికి చేరే పరిస్థితి లేకపోవడం, విమానాశ్రయం నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో వీరి తరలింపుపై ఉత్కంఠ నెలకొని ఉంది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.
మరోవైపు, ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం కాబూల్‌లో రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని తరలించింది.