ముక్కూ మొగం తెలియని అపరిచిత భారతీయుడిని ఉన్మాది కాల్పులనుంచి కాపాడటానికి తన ప్రాణం అడ్డేసి తుపాకి బుల్లెట్లకు ఎదురు నిలిచిన ఆ మానవతా మూర్తిని ప్రవాస భారతీయులు జీవిత కాలపు జ్ఞాపికను ఇచ్చి గౌరవించారు. విదేశీయులను తరిమి కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న గడ్డపై మానవత్వం తమకు కాసింతదూరంలోనే ఉందని నిరూపించిన ఆ అమెరికన్ వాసికి ప్రవాస భారతీయులు సహాయం చేసిన వారిని మరవని తమ దయాగుణాన్ని లక్ష డాలర్ల రూపంలో చాటుకున్నారు.
గత నెలలో మాజీ అమెరికన్ నేవీ ఉద్యోగి అమెరికాలోని కన్సాస్ పట్టణంలో జరిపిన కాల్పులకు అడ్డంపడి అలోక్ మేడసాని అనే తెలుగు ఎన్నారైని కాపాడిన అమెరికన్ ఇయాన్ గ్రిల్లెట్ను ప్రవాస భారతీయులు తమ స్వంతం చేసుకున్నారు. అతడి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అమెరికాలోని భారతీయులంతా అతడి స్వస్థలమైన కన్సాస్‌లో ఇంటిని కొనుక్కునేందుకని లక్ష డాలర్ల మేరకు విరాళాలు సేకరించారు.
కన్సాస్‌లోని గార్మిన్ కంపెనీలో పనిచేసే కూచిబొట్ల శ్రీనివాస్, అతడి స్నేహితుడు మేడసాని అలోక్ గత నెల 22 రాత్రి అక్కడి బార్‌కు వెళ్లగా ఆడం పూరింటస్ అనే మాజీ నేవీ ఉద్యోగి వాదులాటకు దిగి బయటకు వెళ్లిపోయి మళ్లీ తుపాకితో వచ్చి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, నిందితుడిని అడ్డుకున్న గ్రిల్లట్‌తోపాటు అలోక్‌కు గాయాలు తగిలిన విషయం తెలిసిందే. భారతీయుడిని కాపాడటానికి ప్రాణాలడ్డుపెట్టిన గ్లిల్లట్కు సహాయంగా లక్షడాలర్లను వసూలు చేసి అందించినట్లు ఇండియా హౌస్ హోస్టన్ సంస్థ తెలిపింది. అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఈ చెక్కును ఇయాన్కు అందజేశారు.