ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండా రూపకర్త భారతీయుడే : కేసు నమోదు

శనివారం, 4 జూన్ 2016 (10:29 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండా రూపకర్త భారతీయుడనే నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఎస్ కాలిఫేట్ జెండా, లోగోలను రూపొందించి ఇచ్చినట్లు కేసు నమోదైంది. అతని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు జాతీయ భద్రత సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం దాఖలు చేసిన అభియోగ పత్రాలలో పేర్కొన్న వివరాల ప్రకారం. 
 
చెన్నైలో ఇంజినీరింగ్ చదివిన మహ్మద్ నాజిర్ ఈ లోగో, జెండాను రూపొందించాడు. గత డిసెంబరులో సిరియా వెళ్ళేందుకు సూడాన్ చేరుకున్న నాజిర్‌ను అక్కడి పోలీసులు నిర్బంధించి, భారతదేశానికి పంపించారు. నాజిర్ తండ్రి అమీర్ మహ్మద్ దుబాయ్‌లో ప్యాకర్‌గా పనిచేస్తున్నారు. తన కొడుకు సిరియాలో యుద్ధం కోసం వెళ్తున్నట్లు తెలుసుకున్న అమీర్ వెంటనే భారతదేశానికి వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్ స్టేట్‌మెంట్‌ను సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారు. అతని కొడుకుకు వ్యతిరేకంగా అత్యంత కీలక సాక్షుల్లో ఒకరిగా అమీర్ పేరును చేర్చారు. అభియోగపత్రాన్ని ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి అమర్‌నాథ్‌కు సమర్పించారు.
 
నాజిర్ చెన్నైలోని ఓ కళాశాలలో బీఈ చదివాడని, ఉద్యోగం కోసం 2014లో దుబాయ్‌ వెళ్ళాడని ఎన్ఐఏ తెలిపింది. కొంతకాలం పాటు నెలకు 2500 దిర్హామ్‌ల జీతంపై వెబ్‌ డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశాడని పేర్కొంది. ఐఎస్ ప్రచార వీడియోలను చూసిన తర్వాత రాడికల్‌గా మారాడని తెలిపింది. తన యజమాని నుంచి తన పాస్‌పోర్టును దొంగిలించి, యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా సూడాన్ వెళ్ళాడని వివరించింది. ఆన్‌లైన్ గ్రూప్ ద్వారా జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ మేనేజర్ మహ్మద్ సిరాజుద్దీన్‌తో సంప్రదింపులు జరిపేవాడని పేర్కొంది. సిరాజుద్దీన్‌పై అభియోగపత్రాన్ని శనివారం దాఖలు చేస్తారు. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 9న జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి