బ్రిటన్ ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీకి కొత్త నాయకురాలిగా ఎన్నికైన కెమీ బాడెనాక్ తన షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ (52)ను మంగళవారం నియమించారు. పటేల్ పూర్వీకులు గుజరాతీలు. రిషి సునాక్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన ప్రీతి, మహిళా వ్యవహారాల మంత్రిగా బాడెనాక్ బాధ్యతలు నిర్వహించారు. షాడో విదేశాంగ మంత్రి హోదాలో ప్రీతి పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి డేవిడ్ లామిని ఎదుర్కొంటారు.
కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ అధ్యక్షత కోసం, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకత్వ పాత్ర కోసం కెమీ బాడెనాక్‌తో పోటీపడినవారిలో ప్రీతి పటేల్ కూడా ఉన్నారు. బరిలో నిలిచిన మరి ఇద్దరు ప్రత్యర్థులు - రాబర్ట్ జెన్రిక్, మెల్ స్లైడ్లను బాడెనాక్ తన షాడో మంత్రివర్గంలో న్యాయ, ఆర్థిక మంత్రులుగా నియమించి తమ పార్టీలో ఐక్యతను చాటుకున్నారు.