అణు ఒప్పంద పత్రాలపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనని, లేనిపక్షంలో పేల్చేస్తామని ఇరాన్‌ను అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తమ మాటను ధిక్కరిస్తే ఇరాన్‌ను పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, అమెరికా చేసిన హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అణు ఒప్పంద పత్రాలపై సంతకం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కాగా, ఈ అంశంపై డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా, ఇరాన్, అధికారులు చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. ఒకవేళ ఇరాన్ గనుక ఆ ఒప్పందంపై సంతకం చేయకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇరాన్‌ను పేల్చివేస్తాం. ఒకవేళ వారు ఒప్పందం చేసుకోకుంటే నేను నాలుగు సంవత్సరాల క్రితం చేసినట్లుగానే వారిపై మరోమారు సుంకాలు విధిస్తాను అని స్పష్టం చేశారు.
ఒప్పందం చేసుకోకుంటే సైనిక పరిణామాలు ఉంటాయని ట్రంప్ చేసిన హెచ్చరికలను టెహ్రాన్ కొట్టిపారేసింది. ఇదే అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్‌చి మాట్లాడుతూ, ట్రంప్ ఒకలేఖ ద్వారా టెహ్రాన్‌ను కొత్త అణు ఒప్పందం చేసుకోవాలని కోరాడు. దీనికి ఇరాన్ ప్రతిస్పందనను ఒమన్ ద్వారా చేరవేసింది అని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థకు తెలిపింది.
ఇరాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేసే ఎజెండాను కలిగి ఉందని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. యురేనియంను అధిక స్థాయిలో శుద్ధి చేయడం ద్వారా అణు ఆయుధ సామర్థ్యాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోందని, ఇది పౌర అణు ఇంధన కార్యక్రమానికి సమర్థనీయం కాదని ఆ దేశాలు వాదిస్తున్నాయి. అయితే, తమ అణు కార్యక్రమం పూర్తిగా తమ పౌర అవసరాల కోసమేనని టెహ్రాన్ స్పష్టం చేసింది.