మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

ఠాగూర్

శుక్రవారం, 23 మే 2025 (14:48 IST)
భారత్‌కు పాకిస్థాన్ మరోమారు హెచ్చరిక చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‍తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ జీర్ణించకోలేకపోతోంది. దీంతో భారత్‌ను హెచ్చరిస్తుంది. సింధీ నదీ జలాల ఒప్పందం మేరకు తమకు రావాల్సిన నీటిని ఆపేస్తే తాము భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ నదీ జలాల విషయంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ గతంలో ఉపయోగించిన పదజాలాన్నే ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ, "మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం" అని చౌదరి భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా గతంలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
జమ్మూకాశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం, ఏప్రిల్ 23న భారత్ సింధు జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధు నది, దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించింది. 
 
ఈ ఒప్పందం మేరకు పాకిస్థాన్‌కు భారత నీటిని విడుదల చేస్తోంది. ఇపుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు నీటి విడుదలను కూడా నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ ఉగ్రవాదులు, ఆ దేశ సైనికులు హెచ్చరికలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు