ఖలీస్థానీ వేర్పాటువాదుల దశ్చర్య... నాడు గాంధీ విగ్రహం ధ్వంసం.. నేడు అసభ్యకర రాతలు

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (09:28 IST)
ఖలీస్థానీ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రధాని హోదాలో ఇటలీలో తొలిసారి పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు ఖలిస్థానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు. 
 
ఇటీవల హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌‍కు సంబంధించి అభ్యంతరకర రాతలు రాశారు. అయితే, విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు. ఇటలీలో జూన్ 13 - 15 మధ్య జరగనున్న 50వ జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో మోడీ పాల్గొననున్న విషయం తెలిసిందే.
 
కాగా, ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా స్పందించారు. ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతేడాది కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లోని ఓ యూనివర్సిటీ కాంపస్‌లో కూడా ఖలిస్థానీ వాదులు ఇదే దుశ్చర్యకు పాల్పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాంపై అభ్యంతరకర రాతలు రాశారు.
 
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీచేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇది. ఇక జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో మోడీ పాల్గొనడం ఇది వరుసగా ఐదోసారి. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్ - రష్యా, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధాలు ప్రధానాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు