ముస్లిం సోదరుల పవిత్ర పండగల్లో బక్రీద్ ఒకటి. ఆ రోజున ప్రతి ముస్లిం ఎంతో పవిత్రంగా ఉంటారు. కానీ, తమ ఉన్మాద చర్యలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మాత్రం మరింత రెచ్చిపోయారు. బక్రీద్ రోజున మేక తలలకు బదులు మనుషుల తలలు కోసి పండగ చేసుకున్నారు. పైగా, అత్యంత దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐసిస్ విడుదల చేసింది.
ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఈ వీడియోను చూసిన ప్రపంచం షాక్‌కు గురైంది. మొత్తంగా 12 నిమిషాలపాటు సాగిన ఈ వీడియోలో కొన్నిచోట్ల పారిస్‌లోని ఈఫిల్ టవర్, నీస్‌లో జరిగిన ట్రక్కు దాడి దృశ్యాలను పొందుపరిచారు. బందీల పీక కోస్తున్న ఈ వీడియోను ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఓ జంతువధశాలలో తీసినట్టు ఐసిస్ చెబుతోంది.