బ్యాంకు రుణాలు ఎగొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబయి ప్రత్యేక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులును బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది.
జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకోవడానికి ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెల్లడించారు. అయితే ఉత్తర్వులను కోర్టు జనవరి 18 వరకు నిలిపివేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలపై సంబంధిత పక్షాలు(మాల్యా) బొంబాయి హైకోర్టులో అపీలు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
జప్తు చేసిన ఆస్తులు వేలం వేయడానికి బ్యాంకుల కన్సార్టియంకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇదివరకే ప్రత్యేక కోర్టుకు తెలిపింది ఈడీ. 2013 నుంచి చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో కలిపి రూ. 6,203.35 కోట్లకు ఆస్తుల వేలం నిర్వహించాలని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది.