శ్రీవారి భక్తులకు టీటీడీ మరో షాక్!

శనివారం, 16 నవంబరు 2019 (17:21 IST)
శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. ఇటీవలే కొన్ని వసతి గదుల అద్దెలను వంద శాతానిపైగా అమాంతం పెంచేసిన టీటీడీ.. తాజాగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.

దీంతో టీటీడీ అధికారుల తాజా ప్రతిపాదనను భక్తులు తీవ్రంగా తప్పు బడుతున్నారు.
 తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను శ్రీవాణి ట్రస్ట్‌కు పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. అలాగే కొండపై కొన్ని గదుల అద్దెలను వంద శాతానికి అమాంతం పెంచేసింది.

600 రూపాయలు విలువ ఉన్న నందకం గది అద్దెను 1000 పెంచగా, 500 రూపాయలున్న కౌస్తుభం, పాంచజన్యం గదుల అద్దెలను వెయ్యి రూపాయలకు పెంచారు.
 
ఆ షాక్ నుంచి భక్తులు కోలుకోకముందే.. టీటీడీ మరో షాక్ ఇచ్చింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూల ధరలను 50 రూపాయలకు పెంచాలని భావిస్తోంది టీటీడీ. 
 
కాలిబాటన తిరుమలకు వచ్చి దివ్య దర్శనం టోకెన్లతో శ్రీవారిని దర్శించుకునే ప్రతిభక్తుడికీ ఉచితంగా ఓ లడ్డూ.. సబ్సిడీపై మొదట 20 రూపాయలకు రెండు లడ్డులు ఇస్తారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే.. ఒక్కో లడ్డూకు 50 రూపాయలు వసూలు చేస్తారు.

అదేవిధంగా సర్వదర్శనం భక్తులకు కూడా సబ్సిడీపై నాలుగు లడ్డూలు ఇస్తున్నారు. ఇంకా అదనపు లడ్డూలు కోరుకునే భక్తుల కోసం ఆలయం వెలుపల కౌంటర్లలో ఒక్కొక్క లడ్డూను 50 రూపాయలకు టీటీడీ విక్రయిస్తోంది.
 
ఇంతవరకు బాగానే ఉంది.. కానీ.. సబ్సిడీపై ఇస్తున్న లడ్డూల వలన టీటీడీకి భారీగా నష్టం వాటిల్లుతోందని భావిస్తున్నారు అధికారులు. దీంతో సబ్సిడీ లడ్డూలు ఇవ్వడం పూర్తిగా నిలిపివేసి శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఒక ఉచిత లడ్డూ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. 
 
ఆ తర్వాత అదనపు లడ్డూలు కోరుకునే భక్తులకు 50 రూపాయలు ఒక లడ్డు విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా అధికారుల ఆలోచనలు టీటీడీకి లాభాలు తెచ్చి పెట్టచ్చుగానీ.. తిరుమల కొండను ఓ వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
మొత్తానికి మొన్న గదుల అద్దె పెంపు.. నేడు సబ్సిడీ లడ్డూల రద్దు.. ఇలా టీటీడీ తన కొత్త కొత్త నిర్ణయాలతో భక్తుల ఆగ్రహానికి గురవుతోంది. మరి దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు