అగ్రరాజ్యం అమెరికాకు చిటికెన వేలంతలేని ఉత్తర కొరియా ముచ్చెమటలు పట్టిస్తోంది. తాము తలచుకుంటే క్షణాల్లో అమెరికాను నామరూపాలు లేకుండా చేస్తామంటూ హెచ్చరిస్తోంది. ఇప్పటికే వరుసగా క్షిపణి పరీక్షలతో, పదునైన ప్రకటనలతో దూకుడును ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియా... అగ్రరాజ్యం అమెరికాను తుడిచిపెట్టేస్తామని గర్జించింది. ఫలితంగా కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలతో సైనిక విన్యాసాల కోసం అమెరికాకు చెందిన అణ్వస్త్ర విమానవాహక నౌకతో పాటు పలు యుద్ధ నౌకలు ఉత్తర కొరియా సముద్ర జలాల్లోకి మొహరింపజేసింది. ఉ.కొరియాపై దాడికే ఈ యుద్ధ నౌకలను మొహరిస్తున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చర్యలపై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అమెరికా ఇక్కడ యుద్ధానికి దిగితే అమెరికాను నామరూపాల్లేకుండా చేస్తామని, ప్రపంచ చిత్ర పటంలో ఆ దేశమే లేకుండా చేస్తామని ఉ.కొరియా హెచ్చరించింది. ఇప్పటికే పలు మార్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... ఈ తరహా హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.