భారత జవాన్లను 'ముక్కలు' చేయడం మూడోసారి...

మంగళవారం, 2 మే 2017 (14:47 IST)
పాకిస్థాన్ ఆర్మీ మరో దుశ్చర్యకు తెగబడింది. సరిహద్దుల్లో కవ్వించి.. ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపడమే కాక.. అత్యంత కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసిన ఘటనపై భారత సైన్యం భగ్గుమంటోంది. పాక్‌ సైన్యం నీచమైన చర్యకు తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించింది. 
 
అయితే, పాకిస్థాన్ సైన్యం ఈ తరహా దాడులకు పాల్పడటం ఇది మూడోసారి. నియంత్రణ రేఖను దాటడం.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నేరుగా భారత ఆర్మీ పోస్టులపై ఎలాంటి కవ్వింపూ లేకుండా, విచక్షణరహితంగా కాల్పులు జరపడం. పాక్‌ ఆర్మీ తరచుగా చేసే పని ఇదే. ఉదాహరణకు.. గత నెల(ఏప్రిల్‌)లో పాక్‌ దళాలు పూంఛ్‌, రాజౌరీ సెక్టార్లలో ఏడుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మొత్తంగా ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 65 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. 
 
2016లో నియంత్రణ రేఖ వెంబడి 228 సార్లు.. ఎల్‌వోసీ వెంబడి 221సార్లు పాక్‌ సైనికులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారు. అలాగే.. 2016లో సరిహద్దుల వెంబడి మన సైన్యం 150 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 2015లో 101 మంది, 2014లో 104 మంది ఉగ్రవాదులను హతమార్చింది. 
 
కాగా.. పాక్‌ ఆర్మీ మన సైనికుల మృతదేహాలను ముక్కలు చేయడం గత ఆరునెలల్లో ఇది మూడోసారి అని ఆర్మీ వర్గాల సమాచారం. నిరుడు అక్టోబరు, నవంబరు నెలల్లో నియంత్రణ రేఖవెంబడి మాచిల్‌ ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయని.. ఇద్దరు సైనికుల తలలను పాక్‌ సైనికులు తెగనరికారని ఆ వర్గాలు వివరించాయి. 

వెబ్దునియా పై చదవండి