ఇటీవల మరియం రజా అనే ఎయిర్ హోస్టెస్ పీకే-782 విమానంలో ఇస్లామాబాద్ నుంచి కెనడా వెళ్లింది. టొరంటోలో దిగిన అనంతరం ఆమె నుంచి సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు టొరంటో నుంచి కరాచీ వెళ్లే విమానంలో ఆమె విధులకు హాజరు కావాల్సి ఉండగా, ఆమె ఎంతకీ రాకపోవడంతో అధికారులు ఆమె హోటల్ గదిని పరిశీలించారు. కృతజ్ఞతలు పీఐఏ అంటూ ఓ లేఖను, ఆమె యూనిఫాంను కనుగొన్నారు. ఆమె ఎటు వెళ్లిందో మాత్రం తెలియదు.
అయితే, అదృశ్యమైన ఎయిర్ హోస్టెస్‌లు కెనడాలో స్థిరపడే ఉద్దేశంతో అక్కడే ఉండిపోతున్నారని భావిస్తున్నారు. కాగా, తమ సిబ్బంది కెనడాలో ఆచూకీ లేకుండా పోవడం కొత్తేమీ కాదని, 2019లో ఈ తంతు మొదలైందని పీఐఏ వెల్లడించింది. విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి కెనడా పారిపోయి అక్కడే స్థిరపడినట్టు తెలిపింది. ఆ ఉద్యోగి సలహాతో మిగతావాళ్లు కూడా కెనడా బాటపడుతున్నారని పీఐఏ వివరించింది.
విదేశీయులకు కెనడాలో సులభంగా ఆశ్రయం లభిస్తుండడం కూడా తమ ఉద్యోగుల మిస్సింగ్‌కు దారితీస్తోందని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అభిప్రాయపడింది. ఈ తరహా ఘటనలను అరికట్టడానికి కెనడా అధికారులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాకిస్థాన్ దేశంలో ఆర్థిక, రాజకీయ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతుండటంతో అనేక మంది ఆ దేశం వీడిపోయేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.