ఉగ్రవాదులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. తమ దేశంలో ప్రారంభమైన క్రీడా టోర్నీలో పాల్గొన్న రోడ్రిగో మాట్లాడుతూ తలలు తెగనరుకుతూ దారుణాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకంటే తాను 50 రెట్ల కిరాతకుడినని పేర్కొన్నారు. సైనికులు తీవ్రవాదులను సజీవంగా పట్టుకుంటే వాళ్ల కాలేయాలను ఉప్పు, వెనిగర్‌తో వేయించుకు తింటానని వ్యాఖ్యానించారు.
‘వారి కన్నా నేను 50 రెట్లు అధికంగా క్రూరుడిని.. వాళ్లు తలలు మాత్రమే నరుకుతారు... నాకు ఉగ్రవాదులు సజీవంగా దొరికితే మాత్రం వాళ్లను తినేస్తా’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో తీవ్ర భయోత్పాతాన్ని కలిగించడానికి ఉగ్రవాదులు తలలు నరికేస్తున్నారని, అయితే, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అదేసమయంలో డ్రగ్స్ బానిసలకు మరణదండన తప్పదంటూ తరచూ గట్టిగా హెచ్చరించే డ్యుటెర్టే... తీవ్రవాదుల విషయంలో మరింత పదునైన పదజాలాన్ని ఉపయోగించడం గమనార్హం. శిరశ్ఛేదనాల వంటి కిరాతక దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు తాను ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నదీ వివరిస్తూ ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ప్రముఖ పర్యాటక ప్రాంతం బోహోల్‌లో ఉగ్రవాదులు తలపెట్టిన దాడిని ఫిలిప్పీన్స్ పోలీసులు పసిగట్టి నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కుట్రపన్నిన మిలిటెంట్లను వెదికి మట్టుబెట్టాలనీ... వారిని సజీవంగా తనవద్దకు తీసుకురావద్దని డ్యుటెర్టే ఆదేశించారు. చిక్కకుంటే కాల్చిపారేయాలని తమ సైనికులకు సూచించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానన్నారు.