అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలవడంపై హిల్లరీ క్లింటన్ మనో వేదనకు గురైయ్యారు. తొలిసారి మీడియాతో హిల్లరీ మాట్లాడుతూ ఓడిపోయినా.. అమెరికన్ల కలలు నెరవేర్చేందుకు సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా విజేత ట్రంప్‌గు హిల్లరీ అభినందనలు తెలిపారు. చాలా కష్టపడినా మనకు కోరుకున్న ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో దేశం కోసం ప్రజల ముందు మనం ఉంచిన దృక్పథం, మనం చూపిన విలువలు అత్యధికుల మనసులను మెప్పించలేదని హిల్లరీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. రాజకీయంగా ఎటువంటి పదవులు చేపట్టకుండా నేరుగా అమెరికా అధ్యక్షుడైన తొలి వ్యక్తిగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా మరో అరుదైన రికార్డును సృష్టించారు. ట్రంప్ గెలుపుతో అమెరికా ప్రథమ మహిళగా గుర్తింపు పొందనున్న రెండో విదేశీ మహిళగా రికార్డు నెలకొల్పారు. అంతకుముందు 1825-1829లో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్స్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూసియా మొదటి విదేశీ మహిళగా రికార్డు సృష్టించారు.