పచ్చని పైన్, యూకలిప్టస్ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిస్తే.. 20 కిలోమీటర్ల పొడవునా వ్యాపించిన కార్చిచ్చు బారినపడిన కార్లు ఉన్నచోటునే దగ్ధమయితే, డజన్లకొద్దీ మంటల్లో చిక్కుకుని మరణిస్తే.. ఇది పోర్చుగల బీభత్సం. మన దేశంలో కార్చిచ్చు అడవులకే పరిమితం కాగా యూరప్ దేశాల్లో రోడ్లను కూడా మంటలు వ్యాపించి మనుషులను, వాహనాలను నిలువునా తగలబెడుతున్నాయి. దీనికి తాజాగా బలయింది మాత్రం పోర్చుగల్.
ఐరోపా దేశం పోర్చుగల్ అడవుల్లో వ్యాపించిన మంటలు 62 మందిని బలి తీసుకున్నాయి. అప్పటివరకు పచ్చని పైన్, యూకలిప్టస్ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిచ్చాయి. మంటల్లో చిక్కుకుని మరో 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది లీరా ప్రాంతంలో కార్లలో ప్రయాణిస్తుండగా అగ్నికీలలు చుట్టుముట్టి మరణించారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు.
పెడ్రొగో గ్రాండే ప్రాంతంలో శనివారం మొదలైన మంటలు దావానంలా వ్యాపించాయి. రోడ్డుకిరువైపులా 20 కి.మీ పైగా దూరం వరకు తెల్లటి పొగ మేఘాలు కమ్మేశాయి. మంటలు ఆ ప్రాంతంలోని ఇళ్లకు కూడా వ్యాపించాయి. అక్కడి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి, సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మంటల్ని ఆర్పడానికి 900 మంది అగ్నిమాపక సిబ్బంది 300 వాహనాలతో ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పడానికి సాయపడే విమానాలను స్పెయిన్, ఫ్రాన్స్‌లు పోర్చుగల్‌కు పంపాయి.