విద్యుత్ సరఫరాలో అంతరాయం... చిమ్మ చీకట్లో పాకిస్థాన్‌

ఆదివారం, 10 జనవరి 2021 (15:08 IST)
పాకిస్థాన్‌లో గాఢాంధకారం నెలకొంది. శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో దేశం యావత్తూ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా చీకట్లు అలుముకోవడంతో ప్రజలు హాహాకారాలు చేశారు. 
 
సాంకేతిక లోపాలతో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతరాత్రి పవర్ గ్రిడ్‌లో తలెత్తిన సమస్యతో పాకిస్థాన్‌లోని అన్ని విద్యుత్ ప్లాంట్లు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, రావల్పిండి, కరాచీ, ముల్తాన్, ఫైసలాబాద్ వంటి ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. 21 కోట్ల మంది జనాభా చీకట్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
 
విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పాక్ విద్యుత శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాత్ ట్విటర్‌లో తెలిపారు. గుడ్డూ థర్మల్ విద్యుత్ కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సమస్య తలెత్తిందని ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విద్యుత్ జెనరేట్లర్ల కోసం బారీ ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారు. అక్కడి పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టారు. అతి పెద్ద నగరం కరాచీలో ఆదివారం వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. 
 
అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సమస్యను పరిష్కరించారు. ఇక రాజధాని ఇస్లామాబాద్‌లో పాక్షికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధించారు. కానీ, విమానయాన సర్వీసులకు మాత్రం ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నామని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ తెలిపారు. 
 
పాక్‌లో ఇటువంటి విద్యుత్ అంతరాయాలు గతంలోనూ సంభవించాయి. ముందు జాగ్రత్త కోసం అక్కడి ప్రజల్లో అనేక మంది తమ ఇళ్లలో పెట్రోల్ జెనరేటర్లను ఎల్లవేళలా సిద్ధంగా ఉంచుకుంటారు. ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ఇతర కీలక రంగాల్లోని సంస్థలు కూడా అనేక అత్యవసర ఏర్పాట్లతో నిత్యం అప్రమత్తంగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు