ఫ్రాన్స్, ఆస్ట్రేలియా,ఇటలీ, బ్రిటన్‌లలో కోవిడ్ ఆంక్షలపై నిరసనలు తీవ్ర రూపం
సోమవారం, 26 జులై 2021 (07:47 IST)
కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా,ఇటలీ, బ్రిటన్‌లలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రెస్టారెంట్లు ఇతర బహిరంగ స్థలాల్లో ప్రవేశానికి కోవిడ్ పాస్‌లు తప్పనిసరి చేస్తూ మాక్రాన్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ పారిస్‌లోని ఈఫెల్‌టవర్ వద్ద వేలాది మంది ఆందోళన నిర్వహించారు.
వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. రెస్టారెంట్లు, బహిరంగ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే వ్యాక్సినేషన్ వేయించుకోని వారికి ప్రత్యేక హెల్త్ పాస్‌ను తప్పనిసరిచేస్తూ ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో దాదాపు లక్షా 60 వేల మంది దాకా పాల్గొన్నారు.
''స్వేచ్ఛ, స్వేచ్ఛ'' అంటూ ఈ సందర్భంగా నినదించారు. 'నిరంకుశ మాక్రాన్', 'స్వేచ్ఛకు బిగ్ ఫార్మా సంకెళ్లు' అని పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదేవిధంగా ఇటలీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'గ్రీన్‌పాస్' విధానానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. రోమ్, నప్లేస్, టూరిన్ నగరాలతో సహా దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో నియంతృత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు.
రెస్టారెంట్లు, సినిమాలకు వెళ్లాలన్నా, ఇతర ఇండోర్ కార్యకలాపాల్లో పాల్గొనాలన్నా తరువాతి నెల ప్రారంభం నుంచి ఇటలీ ప్రభుత్వం సర్టిఫికెట్‌ను జారీచేసింది. పౌరుల స్వేచ్ఛను హరిస్తున్నారని బ్రిటన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్ అండ్ ట్రేస్ యాప్‌ను వ్యతిరేకిస్తూ లండన్‌లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి.
ఈ యాప్ తమ కదలికను నియంత్రిస్తోందని, ఈనెలలో ఒక్క వారంలోనే 6 లక్షల మందికి పైగా స్వీయ ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చిందని ఆందోళనకారులు తెలిపారు. బ్రిటన్‌లో చాలా వరకు కోవిడ్ ఆంక్షలను సడలించిన వారం రోజుల తర్వాత ఈ ఆందోళనలు జరగడం గమనార్హం.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో అనుమతి లేకుండా మార్చ్ చేపట్టారంటూ పోలీసులు డజన్ల మంది ఆందోళనకారులను ఆరెస్టు చేశారు. 'ఫ్రీడమ్' పేరుతో చేపట్టిన ఈ ర్యాలీలో నిరసనకారులు వేకప్ ఆస్ట్రేలియా, డ్రెయిన్ ది స్వాంప్ అనే నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.