ఆ రెండు దేశాల మధ్య యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధమే.. పుతిన్ హెచ్చరిక

ఠాగూర్

సోమవారం, 18 మార్చి 2024 (09:18 IST)
నాటో దళాలు, రష్యా దళాల మధ్య యుద్ధమంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అయితే, ఈ పరిణామాన్ని ఏ ఒక్కరూ లేదా ఏ ఒక్క దేశం కోరుకోదని ఆయన అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మరోమారు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమెరికా నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమి, రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలుస్తుందన్నారు. 
 
రష్యా, నాటో దళాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని, అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అడుగుదూరంలో ఉంటుందని పశ్చిమ దేశాలను ఆయన సోమవారం హెచ్చరించారు. నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం ముప్పు పొంచివుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారంటూ పుతిన్ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని తాను భావిస్తున్నానని పుతిన్ అన్నారు. 
 
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే నాటో సైనిక సిబ్బంది ఉన్నప్పటికీ.. యుద్ధంపై చర్చించేందుకు ఫ్రాన్స్, ఇంగ్లండ్లను ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదని పుతిన్ చెప్పారు. కాగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు, రష్యా మధ్య సంబంధాలు అథమ స్థాయికి సన్నగిల్లిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు