ఓ బాలుడిని దత్తత తీసుకోండి.. విద్యాఖర్చు భరిస్తా : రాఘవ లారెన్స్

మంగళవారం, 29 అక్టోబరు 2019 (19:35 IST)
బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల బాలుడి తల్లిదండ్రులకు సినీ నటుడు రాఘవ లారెన్స్ ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ దేశంలో తల్లిదండ్రులు లేని చిన్నారులు చాలా మంది ఉన్నారనీ అలాంటివారిలో ఒక బాలుడిని దత్తత తీసుకుని, ఆ పిల్లోడికి సుజిత్ అనే పేరు పెట్టుకోవాలని సూచించాడు. పైగా, ఆ బాలుడు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. అక్టోబరు 29వ తేదీన రాఘవ లారెన్స్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. 
 
కాగా, ఈ నెల 25వ తేదీన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో రెండేళ్ల బాలుడు సుజిత్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోగా, అధికారులు బాలుడిని రక్షించాలని నాలుగురోజులపాటు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
అయితే, బిడ్డను కోల్పోయిన సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ సానుభూతి తెలియజేశారు. సుజిత్ ఎక్కడికీ పోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. అలాగే, ఓ విజ్ఞప్తి కూడా చేశాడు. 
 
దేశంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది వున్నారని, అటువంటి వారిలో ఒకరిని దత్తత తీసుకోమని కోరారు. సుజిత్ పేరునే ఆ పిల్లవాడికి పెట్టమని విజ్ఞప్తి చేశారు. ఆ బాలుడి విద్యకయ్యే ఖర్చును తానే భరిస్తానని రాఘవ లారెన్స్ హామీ ఇచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు