కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు వీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ "భారత్ జోడో యాత్ర"ను ప్రారంభించారు. ఈ యాత్రం తమిళనాడు నుంచి జమ్మూకాశ్మీర్ వరకు కొనసాగనుంది. ఇప్పటికే తమిళనాడులో యాత్ర పూర్తికాగా, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది.
అయితే, ఈ యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. 'మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు.