సూప్‌లో ఎలుకపడింది... ఆ రెస్టారెంట్ షేర్లు పతనమయ్యాయి...

ఠాగూర్

మంగళవారం, 25 మార్చి 2025 (09:14 IST)
సూప్‌లో ఎలుక పడటంతో ఓ రెస్టారెంట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ షేర్ల పతనం ఘటన జపాన్ దేశంలో వెలుగులోకి వచ్చింది. ఈ దేశంలోని ప్రఖ్యాత జెన్షో హోల్డింగ్స్ కంపెనీ నిర్వహణలో కొనసాగుతున్న సుకియో రెస్టారెంట్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఆ రంగంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి జెన్షో గడిచిన కొన్నాళ్లుగా బాగానే రాణిస్తుంది. జపాన్ వ్యాప్తంగా సుమారు రెండు వేలకు పైగా సుకియా ఔట్‌లెట్లు ఉన్నాయి. గత యేడాది షేర్ 25 శాతం మేరకు పెరిగింది. ఇటీవల పెంచిన ధరల కారణంగా కంపెనీ కొన్ని లాభాల్లోకి వస్తుందని అంచనాలతో దూసుకువెళుతున్న తరుణంలో దక్షిణ జపాన్‌లోని టొటొరి బ్రాంచ్‌లో ఓ కస్టమర్ తిన్న సూప్ బౌల్‌లో చనిపోయిన ఎలుక అవశేషాలు బయటపడ్డాయి. ఇదే ఆ కంపెనీకి శాపంగా మారింది.
 
ఈ ఘటన జనవరి 21వ తేదీన జరుగగా, మార్చి 22వ తేదీన వెలుగులోకి వచ్చింది. దీనిపై జెన్షో సంస్థ స్పందిస్తూ, పండేటపుడు పొరపాటున జరిగిన ఈ ఘటనకు తాము చింతిస్తున్నామని ప్రకటన చేయడమే కాకుకుండా ఆలస్యంగా వెల్లడించినందుకు క్షమాపణలు చెపుతున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తంకాకుండా చూసుకుంటామని కూడా ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ఘటన వెలుగు చూసిన రెండు రోజుల్లోనే అంటే మార్చి 24వ తేదీన ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 7.1 శాతం మేరకు షేర్లు పతనమయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు