అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్ కూడా పయనించాలని నిర్ణయించింది. తమ దేశంలో పనిచేసే భారత ఐటీ కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం భారత ఐటి నిపుణులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గడువు ముగిసిన వీసాలు పొడిగించేందుకూ ససేమిరా అంటోంది. అంతేగాకుండా కొత్త వీసాల జారీని దాదాపుగా ఆపేశారు.
ఇక వీసా గడువు ముగియనుండతోనే ఆ దేశం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిర్ణయంతో సింగపూర్ కేంద్రంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలకు ఐటీ సేవలు అందిస్తున్న భారత ఐటీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
వీసాల నిరాకరణతో ప్రస్తుతం సింగపూర్‌లోని భారత కంపెనీల్లో పనిచేసే భారత ఐటీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం పదివేలకు దిగువ స్థాయికి పడిపోయిందని నాస్కామ్ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై సింగపూర్ సర్కారుతో చర్చలు జరిపినా.. ఫలితం దక్కలేదు. దీంతో సింగపూర్ నుంచి తమ కంపెనీలను వేరే చోటికి తరలించడం మేలని భారత ఐటి కంపెనీలు భావిస్తున్నాయి.