మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ కావాల్సిన దక్షిణ కొరియాకు చెందిన జేజు విమాన సంస్థకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఆ విమానం ల్యాండిగ్ గేర్ ఫెయిల్ కావడమేనని ప్రాథమికంగా తేలింది. మరణించిన వారిలో 85 మంది మహిళలున్నారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్‌వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది.
థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్ 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్‌కు జెజు ఎయిర్‌కు చెందిన విమానం బయలుదేరింది. ఉదయం 9.03 గంటల సమయంలో ముయాన్‌లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. దీంతో విమానం రన్‌వే పై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్లింది.
వేగాన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు. ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి.. వెంటనే పేలిపోయింది. దీంతో ఇద్దరు మినహా ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. పేలిపోయిన బోయింగ్ 737-800 జెట్ విమానం 15 ఏళ్ల కిందటిది. రన్వేపై విమానం అతి వేగంగా జారిపోతున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. విమానం మొత్తం ధ్వంసమైందని, కేవలం తోక ప్రాంతం మాత్రమే గుర్తుపట్టగలిగేలా ఉందని ముయాన్ అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
విమానం ప్రమాదానికి గురైన వెంటనే 32 అగ్నిమాపక వాహనాలు, 1,560 మంది సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. తమవారి వివరాల కోసం ముయాన్ విమానాశ్రయానికి బాధితులు భారీగా తరలివచ్చారు. గాయపడి బయటపడిన ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.