131కి చేరిన కరోనా మృతుల సంఖ్య.. భారత వైద్య విద్యార్థికి కరోనా సోకిందా?

బుధవారం, 29 జనవరి 2020 (11:16 IST)
చైనాలో కరోనా వైరస్‌ ప్రాణాంతకంగా మారింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా మరో 24 మంది మరణించడంతో మృతుల సంఖ్య 131కి చేరిందని, 4,515 న్యుమోనియా కేసులు నమోదయ్యాయని చైనా ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు 20 విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్నిఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు.
 
భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని ఆయన తెలిపారు. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. చైనా దేశంలోని వూహాన్ నగరంలోని వైద్యకళాశాలలో చదువుతున్న మ‌ధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ లక్షణాలు సోకాయని అనుమానిస్తున్నారు. ఆ విద్యార్థి తన స్వస్థలమైన ఉజ్జయిని నగరానికి ఈ నెల 13వ తేదీన వచ్చారు. వూహాన్ నగరం నుంచి వైద్య విద్యార్థి రావడంతో అతనికి కూడా ఈ వైరస్ సోకి ఉండొచ్చని అనుమానించారు.
 
దీంతో అతన్ని వెంటనే ఉజ్జయిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని జిల్లా కలెక్టరు శశాంక్ మిశ్రా చెప్పారు. ఉజ్జయిని వైద్యవిద్యార్థి రక్తనమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణేలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని కలెక్టరు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు