ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల కోసం పాఠశాలలు.. తాలిబన్ ప్రకటన

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:13 IST)
ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికలు తిరిగి పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు వీలైనంత త్వరలో అనుమతిస్తామని తాలిబన్‌ పేర్కొంది. తమ పురుషుల కేబినెట్‌లో మిగిలిన స్థానాలను ప్రకటించిన తర్వాత ఈ మేరకు వెల్లడించింది. బాలికల విద్యపై తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ ''దీనికి సంబంధించిన విషయాలను మేము ఖరారు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఇది జరుగు తుంది'' అని పేర్కొన్నారు. 
 
ఈ వారాంతంలో పురుష అధ్యాపకులు, విద్యార్థులు సెకండరీ పాఠశాలకు తిరిగి వెళ్లాలని విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించిన తర్వాత తాలిబన్‌ నుంచి పైవిధంగా ప్రకటన రావడం గమనార్హం. అయితే ఆ సమయంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థినుల గురించి మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రస్తావన చేయలేదు. 
 
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం మూసివేసిన మహిళా మంత్రిత్వ శాఖ గురించి ముజాహిద్‌ ఎటువంటి ప్రస్తావన చేయలేదు. తాలిబన్‌ ప్రభుత్వం గత వారం మహిళా మంత్రిత్వ శాఖను రద్దు చేసి దాని స్థానంలో నైతిక ప్రమాణాల ప్రోత్సాహం, వ్యభిచార నియంత్రణ శాఖను కొత్తగా నెలకొల్పిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు