భారత్‌లో ఐసిస్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించిన అమెరికా... పాకిస్థాన్‌కు కూడా హితవు పలికింది. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తే.. తగిన శిక్ష అనుభవించక తప్పదని అమెరికా హెచ్చరించింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తే మొదటికే మోసం వస్తుందని.. అది పాకిస్థాన్‌కే దెబ్బ అంటూ అమెరికా వ్యాఖ్యానించింది. స్వేచ్చ, భావప్రకటన శాంతియుత ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.
హింసాత్మక విధానాలకు పాకిస్థాన్ దూరంగా ఉండాలని అమెరికా సూచించింది. శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు అందరికీ ఉందని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని సైన్యం నియంత్రింస్తోందన్న ఆరోపణలపై స్పందించేందుకు కిర్బీ నిరాకరించారు. ఇది పాకిస్థాన్ అంతర్గత విషయం, దీనిపై తాము కామెంట్ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు.
ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దించేందుకు పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ ముట్టడికి మంగళవారం పిలుపునిచ్చారు. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.