తాగి వాహనం నడపడం ప్రపంచంలో ఎక్కడైనా నేరంగానే పరిగణిస్తారు. అయితే ఈ నేరానికి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఇప్పటి వరకు జరిమానా విధించడంతో సరిపుచ్చుతున్నారు అధికారులు. అతి వేగంగా నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ ఖాతరు చేయకుండా వెళ్లడం, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం... వీటిల్లో ఏది ఉల్లంఘించినా లైసెన్సులు రద్దు చేయడం, జైలుకి పంపడంలాంటి శిక్షలు విధిస్తున్నారు. అయినా మందుబాబులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు.
ఇకలాభం లేదనుకున్న థాయ్ ప్రభుత్వం తాగి బండి నడిపే వాళ్లకు కొత్త శిక్ష అమలు చేస్తున్నారు. ఇంతకు ఆ శిక్ష ఏమిటంటే…. ఆస్పత్రి శవాల గదిలో సేవ చేయడం. వాహనం నడుపుతున్నప్పుడు ఎంత తాగావు? అన్న అంశాన్ని బట్టి ఎన్ని రోజులు శవాల గదిలో పనిచేయాలనేది ఆధారపడి ఉంటుంది. ఇంతకు ఈ శిక్ష థాయ్‌లాండ్ పోలీసులు ఎందుకు ఎంచుకుంటున్నారంటే శవాల గదిలో ఉంటే మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో.. ప్రాణం పోవడం అనేది ఎంత భయానకంగా ఉంటోందో ప్రత్యక్షంగా తెలియజెప్పేందుకే అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
థాయ్‌లో ప్రతి ఏటా 24 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాద మృతుల్లో 25 శాతం మంది తాగి వాహనం నడపడం కారణంగానే మరణిస్తున్నారని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు.
మొదటిసారిగా నలుగురు వ్యక్తులను అక్కడికి పంపించి అక్కడున్న శవపేటికలను శుభ్రం చేయించారు. ఆ నిర్మానుష్య వాతావరణం తమను భయభ్రాంతులకు గురిచేశాయని ఆ వ్యక్తులు తెలిపారు. 12 నుంచి 48 గంటల వరకు ఈ మార్చురీ శిక్ష విధిస్తున్నారు. గతంలో ఉన్న సోషల్ సర్వీస్, జైలు శిక్ష కంటే ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.