పాక్‌తో పాటు టర్కీ, ఖతార్‌లు కూడా ఉగ్రదేశాలే... అమెరికా!

సోమవారం, 2 అక్టోబరు 2017 (10:07 IST)
ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే పాకిస్థాన్‌కు అందించాల్సిన ధన సహాయాన్ని నిలిపివేసి, ఉగ్రవాద సంస్థలను ఏరిపారేసేంత వరకూ ఆంక్షలు విధించాలని నిర్ణయించి ఒత్తిడి పెంచుతోంది. తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్‌తో పాటు ఖతార్, టర్కీ దేశాలను ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న దేశాల జాబితాలో చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 
 
ఈ విషయాన్ని 'ది వాషింగ్టన్ ఎగ్జామినర్' పత్రికకు రాసిన ఓ వ్యాసంలో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వెల్లడించారు. పాకిస్థాన్ ఖాతాను మూసేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డ ఆయన, ఆంక్షల నుంచి ఆ దేశం బయట పడాలంటే, తమ భూ భాగంపై ఉగ్రమూలాలు లేకుండా చేసుకోవాలని, వారికి నిధులివ్వడాన్ని పూర్తిగా నిలిపివేయాల్సి వుంటుందన్నారు. 
 
కాగా, 1979 నుంచి భారత విదేశీ వ్యవహారాల శాఖ, పాక్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలని అమెరికాను కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ వినతిని అమెరికా ఇప్పటికీ నెరవేర్చనుంది. ప్రస్తుతం లిబియా, ఇరాక్, సౌత్ యమన్, సిరియా, క్యూబా, ఇరాన్, సూడాన్, నార్త్ కొరియా దేశాలు ఉగ్రవాద దేశాలని అమెరికా ప్రకటించింది. 
 
ఈ దేశాలన్నీ అంతర్జాతీయ ఉగ్ర సంస్థలకు నిధులను అందిస్తున్నాయని ఆరోపించింది కూడా. వీటిల్లో ఇరాన్, సిరియా, సూడాన్‌‍‌లు పూర్తి ఉగ్రదేశాలని రూబిన్ పేర్కొన్నారు. ఈ జాబితాలో కొత్తగా పాకిస్థాన్, టర్కీ, ఖతార్‌లు కూడా చేర్చేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఇదే అంశంపై త్వరలోనే అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు