సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్

మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (11:19 IST)
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనలోని అక్కసును వెళ్లగక్కారు. ఆమెరికా వస్తువులపై విధిస్తున్న సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ముందుకొచ్చిందని, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని భారత్ ఎన్నో ఏళ్ల క్రితమే తీసుకుని ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
భారత్‌తో అమెరికా వాణిజ్య సంబంధాలు దశాబ్దాలుగా "ఏకపక్ష విపత్తు"గా ఉన్నాయని ట్రంప్ విమర్శించారు. "చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం భారత్‌తో చాలా తక్కువ వ్యాపారం చేస్తాం. కానీ వాళ్లు మనతో భారీగా వ్యాపారం చేస్తారు. వాళ్లకు మనమే అతిపెద్ద క్లయింట్. దీనికి కారణం, ఇప్పటివరకు భారత్ మనపై అత్యధిక సుంకాలు విధించడమే. అందుకే మన కంపెనీలు అక్కడ వస్తువులు అమ్మలేకపోతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా భారత్ తన సైనిక ఉత్పత్తులను, చమురును ఎక్కువగా రష్యా నుంచే కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొంటోందని ట్రంప్ ఆరోపించారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 25 శాతం ప్రతిగా సుంకాలను, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకాలను విధించింది. దీంతో భారత్‌పై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా ఉక్రెయిన్‌పై దాడులకు భారత్ ఆజ్యం పోస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. 
 
అయితే, అమెరికా ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ విధించిన సుంకాలు "అన్యాయమైనవి, అసమంజసమైనవి" అని గతంలోనే విమర్శించింది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ ఎవరికీ "తలవంచేది లేదు" అని, కొత్త మార్కెట్లను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు