జీ-7 సదస్సుపై ఆసక్తి రేపుతున్న ట్రంప్ వ్యాఖ్యలు

గురువారం, 21 మే 2020 (21:29 IST)
ఈ ఏడాది అమెరికాలో జరగాల్సిన జీ-7 సదస్సు నిర్వహణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు నేరుగా సదస్సుకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 
 
ఒకవైపు కరోనాతో బాధపడుతున్న అమెరికాలో ట్రంప్‌ జీ-7 సదస్సు నిర్వహణకు మొగ్గు చూపుతుండటం వెనుక బలమైన కారణమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీ-7 లాంటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ద్వారా అమెరికాలో కరోనా ప్రభావం పెద్దగా లేదనే సంకేతాలు పంపేందుకు ట్రంప్‌ తెగ ఆరాటపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
నిజానికి జీ-7 దేశాల సదస్సు ఈ ఏడాది మార్చిలోనే అమెరికాలో జరగాల్సి ఉంది. అనుకోకుండా కరోనా విజృంభించడంతో జీ-7 సదస్సును జూన్‌లో నిర్వహించాలి, అప్పటివరకు వాయిదా వేసారు. అయితే అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకుంటే, జూన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జీ-7 సదస్సుకు ప్రతినిధులు నేరుగా హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు