హెచ్1బీ వీసాదారులకు ఊరట... పాత కొలువు కొనసాగేందుకు సమ్మతం!

గురువారం, 13 ఆగస్టు 2020 (09:51 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులకు పెద్ద ఊరట కల్పించింది. ఆ వీసా ఉన్న‌వాళ్లు పాత ఉద్యోగ‌మే కొన‌సాగించేందుకు ట్రంప్ స‌ర్కార్ అనుమ‌తిచ్చింది. వీసా నిషేధానికి ముందు ఎటువంటి ఉద్యోగం చేశారో.. అదే ఉద్యోగంలో కొన‌సాగేందుకు అనుమ‌తి క‌ల్పించారు. 
 
హెచ్‌1బీ వీసాదారులపై ఆధార‌ప‌డేవాళ్లు, జీవిత‌భాగ‌స్వాములు, పిల్ల‌లు కూడా అమెరికా ప్ర‌యాణం చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు. టెక్నిక‌ల్ స్పెష‌లిస్టులు, సీనియ‌ర్ లెవ‌ల్ మేనేజ‌ర్లు, ఇత‌ర వ‌ర్క‌ర్ల‌కు ఈ స‌డ‌లింపులో అవ‌కాశం క‌ల్పించారు. అమెరికాలో వీసా నిషేధం కంటే ముందు ఎటువంటి ఉద్యోగం చేశారో.. అదే ఉద్యోగాన్ని కొన‌సాగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ అడ్వైజ‌రీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 
 
అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను త్వ‌ర‌తిగ‌తిన గాడిలో ప‌డేందుకు టెక్నిక‌ల్ స్పెష‌లిస్టులు, సీనియ‌ర్ లెవ‌ల్ మేనేజ‌ర్లు అవ‌స‌రం అన్న‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు ఉన్న‌వారిపై జూన్ 22వ తేదీన అధ్య‌క్షుడు ట్రంప్ బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. 
 
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అమెరికా కార్మికులను ర‌క్షించుకునేందుకు ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు వీసా బ్యాన్ విధిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ స‌ర్కార్ ప్ర‌ణాళిక‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్ వంటి సంస్థ‌లు కోర్టును ఆశ్ర‌యించాయి. దీంతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గి ఈ సడలింపులిచ్చింది. దీనికి కారణం త్వరలో అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగనుండటమే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు