ఆఫ్ఘన్ సంక్షోభానికి తీవ్రవాదమే కారణం: రష్యా

పాకిస్థాన్‌లో తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయకుండా, ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా సంక్షోభానికి పరిష్కారం కనుగొనడం సాధ్యపడదని రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వదేవ్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తిరుగుబాటు కారణంగా తీవ్రమైన భద్రతా సంక్షోభం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

తాలిబాన్ గ్రూపులను అణిచివేసేందుకు అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సేనలు గత కొన్నేళ్లుగా అక్కడ యుద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెద్వదేవ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిష్కారం ప్రత్యక్షంగా పాకిస్థాన్‌లో పరిస్థితులపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలను ఏరివేయకుండా ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి పరిష్కారం లభించదని పేర్కొన్నారు. మెద్వదేవ్ మంగళవారం రాత్రి పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌లతో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

వెబ్దునియా పై చదవండి