ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

ఆస్ట్రేలియా భారతీయులను లక్ష్యంగా చేసుకొని జాత్యహంకార దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌‍కు చెందిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థిపై తాజాగా దాడి జరిగింది. ఈ విద్యార్థి ముఖంపై దుండగులు తీవ్రంగా కొట్టారు.

విక్టోరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆతిథ్య రంగానికి సంబంధించిన కోర్సు చదువుతున్న ఎంఏ ఖాన్ అనే హైదరాబాద్ యువకుడు తాజా జాత్యహంకార దాడిలో బాధితుడయ్యాడు.

మెల్‌బోర్న్ తూర్పు శివారు ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో నడిచివస్తున్న ఎంఏ ఖాన్‌పై సోమవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు.

ఎటువంటి కారణం లేకుండా వారు తనపై దాడి చేసి వెళ్లిపోయారని ఎంఏ ఖాన్ తెలిపాడు. దుండగుల దాడిలో ఖాన్ కళ్ల కిందభాగంలో చర్మం తెగింది. నుదుటి భాగం కూడా బాగా దెబ్బతింది. ఖాన్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అతనికి ముఖంపై కుట్లు పడ్డాయి.

వెబ్దునియా పై చదవండి