ఇరాన్‌లో కొనసాగుతున్న ఎన్నికల అశాంతి

ఇరాన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రత్యర్థుల మద్దతుదారులు ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లో, ఇతర నగరాల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారి విధ్వంసకాండ ఇప్పటికీ కొనసాగుతోంది. గత శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అహ్మదీనెజాద్ తిరుగులేని విజయం సాధించి వరుసగా రెండోసారి ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

అయితే ఆయన ఎన్నికల ప్రత్యర్థి, మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావీ మాత్రం ఎన్నికల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆయన మద్దతుదారులు లక్షల సంఖ్యలో శనివారం నుంచి ఎన్నికల ఫలితాలకు నిరసన తెలుపుతున్నారు. మంగళవారం కూడా వేలాది మంది పౌరులు ఇరాన్ జెండాలను పట్టుకొని వీధుల్లోకి వచ్చారు.

మరోవైపు దేశంలో అశాంతిని తొలగించేందుకు వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లపై రీకౌంటిగ్ జరిపిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని సైతం నిరసనకారులు తోసిపుచ్చారు. ప్రభుత్వ రీకౌంటిగ్ ప్రతిపాదనకు కూడా నిరసనకారులు అంగీకరించలేదు.

టెహ్రాన్‌లో మౌసావి మద్దతుదారులు జరుపుతున్న ఆందోళనను ప్రసారం చేయకుండా విదేశీ మీడియాను అధికారిక యంత్రాంగం నిషేధించింది. ఎన్నికల అశాంతితో దేశ ఇస్లామిక్ వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు దేశంలో చీలికకు కారణం కానివ్వరాదని నిరసనకారులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

వెబ్దునియా పై చదవండి