ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు

ఇరాన్ రాజధానిలో గురువారం కూడా తాజా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై నిరసనలు కొనసాగాయి. నలుపు వస్త్రాలు ధరించి, కొవ్వొత్తులు పట్టుకొని వేలాది మంది నిరసనకారులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చారు. ఇరాన్‌లో గత శుక్రవారం జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావి మద్దతుదారులు ఆ తరువాతి రోజు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

శనివారం వెల్లడైన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ తిరుగులేని విజయం సాధించగా, ఆయన ప్రధాన ప్రత్యర్థి మౌసావి, ఇతర అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు. అయితే ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, వాస్తవానికి తానే విజేతనని మౌసావి ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా వేలాది మంది పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ఇరాన్‌లో అత్యున్నత గార్డియన్ కౌన్సిల్ అధిపతి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను చర్చలకు ఆహ్వానించినప్పటికీ, నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం జరిగిన నిరసన ప్రదర్శనలో పది లక్షల మంది పౌరులు పాల్గొన్నట్లు మౌసావి ప్రతినిధులు తెలిపారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించినవారికి సంతాపం తెలియజేసేందుకు తాజాగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిని ఉద్దేశించి మౌసావి కాసేపు ప్రసంగించారు.

వెబ్దునియా పై చదవండి