చైనా ఉత్పత్తులపై భారత్ నిషేధం పొడిగింపు

చైనా పాల ఉత్పత్తులపై నిషేధాన్ని భారత ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. పాలు, సంబంధిత పదార్థాల్లో చైనా ఉత్పత్తిదారులు విషపూరిత రసాయనాలు కలపడంతో ఇటీవల ఆ దేశంలో శిశు మరణాలు సంభవించాయి. అంతేకాకుండా వేలాది మంది అస్వస్థతకు గురైయ్యారు.

ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతి అయ్యే పాల ఉత్పత్తులపై భారత ప్రభుత్వం కొన్ని నెలల క్రితం నిషేధం విధించింది. దీని గడువు జూన్ 24తో ముగుస్తుండటంతో తాజాగా ఈ నిషేధాన్ని మరో ఆరు నెలల పొడిగించింది. చాక్లెట్లు, చాక్లెట్ ఉత్పత్తులుతోసహా పాల సంబంధ అన్ని రకాల ఉత్పత్తులపై ఈ నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) బుధవారం వెల్లడించింది.

చైనాకు చెందిన అనేక కంపెనీలు తమ పాల ఉత్పత్తుల్లో ప్లాస్టిక్, కృత్రిమ ఎరువుల తయారీలో ఉపయోగించే మెలమిన్‌ను కలపి శిశువుల ప్రాణాలు బలిగొన్నాయి. పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలు అస్వస్థతకు గురైయ్యారు. మెలమిన్ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు చేరతాయి. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతింటాయని పరిశోధనల్లో తేలింది.

వెబ్దునియా పై చదవండి