జపాన్‌లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం

ఈశాన్య జపాన్‌లోని ఫుకుషిమా విద్యుత్ ప్లాంట్ ప్రాంత పరిసరాల్లో 6.8 తీవ్రతతో శుక్రవారం బలమైన భూకంపం సంభవించింది. మియాగీ, ఫుకుషిమా ప్రాంతాల్లో 50 సెంటీ మీటర్ల సునామీ కూడా ఏర్పడినట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చిలో ఏర్పడ్డ భారీ భూకంపం, సునామీలతో తీవ్ర నష్టానికి గురైన కోస్తా ప్రాంతాలలో సునామీ హెచ్చరిక జారీ చేశారు.

సంక్షోభానికి గురైన ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ ప్లాంట్‌‌లో అసాధారణ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతున్న పరిస్థితులు లేవని టోక్యో ఎలక్ట్రిక్ విద్యుత్ కంపెనీ పేర్కొంది. దెబ్బతిన్న రియాక్టర్లను చల్లబరిచే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మార్చి 11న సంభవించిన భూకంపం, సునామీలతో జపాన్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా సుమారు ఇరవై వేల మంది మృతి చెందగా వేలాది మంది గల్లంతయ్యారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం సంక్షోభంలో కూరుకోపోయింది.

వెబ్దునియా పై చదవండి