దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా పుట్టినరోజును (జులై 18) అంతర్జాతీయ మండేలా దినోత్సవంగా ప్రకటించాలని ప్రపంచదేశాలకు ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చింది. నెల్సన్ మండేలా స్వాంతంత్ర్య సంగ్రామానికి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా గాంధీగా పేరొందిన నెల్సన్ మండేలాకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి థెంబా మసెకో గురువారం పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజును అంతర్జాతీయ మండేలా దినోత్సవంగా ప్రకటించాలనే తీర్మానానికి దక్షిణాఫ్రికా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
దీనిని దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంతర్జాతీయ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు దక్షిణాఫ్రికన్లు, ప్రజా సహకార సంస్థలు, ప్రపంచ పౌరులు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పిలుపునిచ్చింది.
మండేలా ఈ ఏడాది 91వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యం కోసం ఆయన 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు మండేలా పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి.