భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రుల మధ్య ఈజిప్టులో జరిగిన సమావేశంలో బలూచిస్థాన్ సమస్య చర్చకు వచ్చిన కొన్ని రోజుల తరువాత మరోసారి ఈ ప్రాంతం వార్తల్లోకెక్కింది. ఈజిప్టులో జరిగే సమావేశం సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో బలూచిస్థాన్ అంశాన్ని కూడా ప్రస్తావించారు.
అనంతరం పాకిస్థాన్‌లోని సమస్యాత్మక బలూచిస్థాన్‌లో భారత్ జోక్యం ఉందంటూ గిలానీ యంత్రాంగం ఇప్పటికీ ప్రచారం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ కూడా తీవ్రవాదంపై పోరుకు, బలూచిస్థాన్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాము తీవ్రవాదంపై చర్యలు తీసుకునేందుకు భారత్ చేత బలూచిస్థాన్‌లో రహస్య కార్యకలాపాలు నిలిపివేయించాలని కయానీ భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కయానీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యంత్రాంగంతో మాట్లాడుతున్న సందర్భంగా పాకిస్థాన్ తీవ్రవాదంపై తీసుకున్న చర్యలకు, బలూచిస్థాన్‌లో స్థిరత్వానికి ముడిపెట్టే ప్రయత్నం చేశారు.