పాకిస్థాన్ గిరిజన ప్రాంతంలోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్ధనల కోసం వందలాది మంది ఒక్కచోటికి చేరిన సమయంలో జరిగిన బాంబుపేలుడులో సుమారు 40 మంది మరణించగా మరో 85 మంది గాయపడ్డారు. ముస్లీంల పవిత్ర రంజాన్ మాసంలో దేశంలో జరిగిన తొలి భారీ దాడి ఇదే.
ఇటీవలి సంవత్సరాల్లో తాలిబాన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులను చవిచూస్తున్న పాకిస్థాన్‌లో కొంతకాలం నుంచి ప్రశాంతత నెలకొన్న పరిస్థితుల్లో ఈ దాడి జరిగింది. వెనువెంటనే ఏ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించనప్పటికీ తాలిబాన్, ఇతర ఇస్లామిక్ మిలిటెంట్లు గతంలో మసీదులపై దాడులు చేసిన చరిత్ర ఉంది.
ఖైబర్ గిరిజన ప్రాంతంలోని ఘుండీ అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. ఖైబర్ ప్రాంతం ఇస్లామిక్ మిలిటెంట్లకు స్థావరంగా ఉంది. పాకిస్థాన్ సైన్యం వీరి ఏరివేతకు అనేకసార్లు ఆపరేషన్లు చేపట్టినప్పటికీ పాక్షిక విజయం మాత్రమే సాధించింది. పేలుడు జరిగిన సమయంలో సుమారు 300 మంది ప్రార్ధనలో నిమగ్నమైవున్నారు.