పాకిస్థాన్‌కు చైనా మొదటి యుద్ధనౌకను అందజేసింది. మొత్తం నాలుగు యుద్ధనౌకలను పాకిస్థాన్‌కు అందజేసేందుకు చైనా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి నౌకను ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో పెట్టింది. ఎఫ్- 22పి అనే ఈ యుద్ధ నౌక పాకిస్థాన్ నావిక దళ అవసరాలకు ఉపయోగపడబోతుంది.
షాంఘైలోని జోన్‌గువా షిప్‌యార్డులో ఈ యుద్ధనౌకను నిర్మించారు. దీనిని గురువారం పాకిస్థాన్‌కు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2005లో పాకిస్థాన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందాల్లో ఈ యుద్ధనౌకల కాంట్రాక్టులు కూడా ఉన్నాయి.
యాంటీ సబ్‌మెరైన్ హెలికాఫ్టర్లు, ఉపరితలం నుంచి ఉపరితలం మీద, ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలను ఈ యుద్ధ నౌకలో ఉపయోగించవచ్చు. ఎఫ్- 22పి యుద్ధ నౌక పాకిస్థాన్ నౌకా దళ పాఠవాన్ని పెంచడంతోపాటు, స్వదేశీ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని కూడా పటిష్టపరచనుంది.