పాకిస్థాన్‌లో 30 మంది తీవ్రవాదులు హతం

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్, వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో సైనిక బలగాల చేతిలో 30 మంది తీవ్రవాదులు హతమయ్యారు. తాలిబాన్ తీవ్రవాదులతో గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో పాకిస్థాన్ మిలిటరీ యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. మిలిటరీ స్థావరాలపై తాలిబాన్లు దాడి చేయడంతో, ప్రతీకార చర్యగా పాక్ సైన్యం సమస్యాత్మక గిరిజన ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది.

ఈ దాడుల్లో 30 మంది తీవ్రవాదులు హతమయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే తాలిబాన్ కమాండర్ మౌలానా ఫజ్లుల్లాని దిగ్బంధించేందుకు రంగం సిద్ధమవుతుందని అధికారులు చెప్పారు. అంతకుముందు అనేక మిలిటరీ స్థావరాలపై తాలిబాన్ తీవ్రవాదులు దాడులు జరిపారు.

అనంతరం దక్షిణ, ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతాల్లో పాక్ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో 20 మంది తీవ్రవాదులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ ముఖ్య అనుచరుడు మౌలానా ఫజ్లుల్లా పాక్ సైన్యం జరిపిన దాడిలో గాయపడి లేదా వారి దిగ్బంధంలో ఉన్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి