పాకిస్థాన్‌లో నార్వే ప్రభుత్వం తన దౌత్యకార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దౌత్యకార్యాలయానికి బెదిరింపులు రావడంతో, భద్రతాపరమైన కారణాలతో నార్వే ప్రభుత్వం తమ దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు గురువారం వెల్లడించాయి.
కొన్నిరోజుల క్రితం ఇస్లామాబాద్‌లోని నార్వే దౌత్యకార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై పాకిస్థాన్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఇస్లామాబాద్‌లో రద్దీగా ఉండే ఓ మార్కెట్ సమీపంలోని నివాస ప్రాంతంలో నార్వే దౌత్యకార్యాలయం ఉంది. బెదిరింపుల నేపథ్యంలో శుక్రవారం వరకు దౌత్యకార్యాలయాన్ని మూసివేశారు.
సాధారణ భద్రతా పరిస్థితులు, వచ్చిన బెదిరింపులను పరిగణలోకి తీసుకొని తమ దౌత్యకార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు నార్వే విదేశాంగ శాఖ తెలిపింది. బెదిరింపుల నేపథ్యంలో ఇటీవల నార్వే దౌత్యకార్యాలయాన్ని ఇస్లామాబాద్ ఐజీపీ సయద్ కలీమ్ ఇమామ్ కూడా సందర్శించారు.
ఇదిలా ఉంటే నార్వే దౌత్యకార్యాలయం మూసివేతపై తమకు ఎటువంటి సమాచారం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిసిందే. దీనికి సంబంధించిన పరిణామాలేవీ తమ దృష్టికి రాలేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ బసిత్ పేర్కొన్నారు.