పాక్‌కు కఠిన సందేశం పంపిన మన్మోహన్

భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనను ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు మన్మోహన్ సింగ్ రష్యా వెళ్లారు. ఈ సదస్సులో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో సమావేశమయ్యారు.

ముంబయి ఉగ్రవాద దాడులు జరిగిన అనంతరం పాకిస్థాన్ అధ్యక్షుడిని మన్మోహన్ సింగ్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రిగా ఇటీవల రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ తన తొలి విదేశీ పర్యటనలో పాకిస్థాన్‌కు తీవ్రవాదం విషయంలో కఠిన సందేశం పంపేందుకు ఉపయోగించుకున్నారు.

భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ ప్రభుత్వం వారి భూభాగం ఉపయోగపడకుండా చూడాలని జర్దారీకి మన్మోహన్ సింగ్ తేల్చిచెప్పారు. జర్దారీని కలుసుకున్నందుకు మొదట సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, ఆ వెంటనే పైసందేశాన్ని స్పష్టీకరించారు. మీకు చెప్పాలనుకుంటున్న సందేశం ఇదొక్కటేనని పేర్కొన్నారు. జర్దారీ, మన్మోహన్ సింగ్ సమావేశం టీవీ కెమేరాల ఎదుటే జరగడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి