పాక్‌తో మరోసారి శాంతి ప్రయత్నాలు: భారత్

పాకిస్థాన్ ప్రభుత్వం శాంతి కోసం ధైర్యం, నిబద్ధత, రాజనీతిజ్ఞత కనబరిస్తే, తాము కూడా వారిని మార్గమధ్యంలో కలుసుకుంటామని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం తెలిపారు. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో మంగళవారం జరిగిన సమావేశంపై మన్మోహన్ మాట్లాడుతూ.. ఉపఖండ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలనుకుంటున్నారు.

అందువలన మనం పాకిస్థాన్‌తో శాంతి కోసం మరోసారి ప్రయత్నించాలని మన్మోహన్ పేర్కొన్నారు. పొరుగుదేశాలతో సంబంధాలకు మనం మార్గాలు మూసివేయరాదన్నారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను. ఉపఖండ ప్రజల ప్రధాన ఆకాంక్ష శాంతి మాత్రమే. దీని కోసం మరోసారి పాకిస్థాన్‌తో ప్రయత్నాలు చేపట్టాలని మన్మోహన్ తెలిపారు.

అయితే దీనికి ముందుగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రశాంతతకు విఘాతం కలిగించే తీవ్రవాదులపై సమర్థవంతమైన, కఠిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ షరతు పెట్టారు. రష్యా పర్యటన నుంచి భారత్ తిరిగి వస్తున్న సందర్భంగా మన్మోహన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ ఆందోళనను పరిష్కరించేందుకు పాక్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జర్దారీ తనతో చెప్పారని ప్రధాని వెల్లడించారు. అయితే భారత్ ఆకాంక్షలను నెరవేర్చడంలో పాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని, దీనిపై స్పందించేందుకు తమకు కొంత సమయం కావాలని జర్దారీ కోరినట్లు మన్మోహన్ తెలిపారు.

తాలిబాన్ల విషయంలో వ్యవహరించినట్లుగానే భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న తీవ్రవాద సంస్థలపై కూడా పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఆ దేశాధ్యక్షుడిని కోరామన్నారు.

వెబ్దునియా పై చదవండి